ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 3:01 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మంత్రి ఇలాకాలో INTUCకు ఎదురుదెబ్బ! సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో TBGKS విజయం ఖాయం: ఈసంపల్లి రమేష్‌

మంత్రి ఇలాకాలో INTUCకు ఎదురుదెబ్బ! సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో TBGKS విజయం ఖాయం: ఈసంపల్లి రమేష్‌

అర్జున్ సమాచారం | అక్టోబర్ 11 | రామగిరి రిపోర్టర్.

మంథని: మంథని నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఆటో డ్రైవర్ల యూనియన్‌, ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం రాబోయే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలకు సంకేతమని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) కేంద్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఈసంపల్లి రమేష్‌ అన్నారు. రానున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో TBGKS విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మంథని ఆటో డ్రైవర్ల యూనియన్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన గడిపెల్లి శ్రీనివాస్‌ అధ్యక్షుడిగా విజయం సాధించగా, ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల్లో కేకే రెడ్డి డిపో కార్యదర్శిగా గెలుపొందారని రమేష్‌ తెలిపారు. ఈ విజయాలు కార్మికుల్లో బీఆర్‌ఎస్‌కు ఉన్న మద్దతును ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.

మంత్రి సొంత నియోజకవర్గంలోనే కార్మిక సంఘ ఎన్నికల్లో ప్రభుత్వ అనుబంధ సంఘానికి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతమవుతుందని అన్నారు. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, ఏపీఏ ఏరియాల్లోని సింగరేణి కార్మికులు TBGKSకు మద్దతుగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈసంపల్లి రమేష్‌ డిమాండ్‌ చేశారు. నెలకు మూడు మెడికల్‌ బోర్డుల నిర్వహణ, లాభాల వాటా చెల్లింపు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, సొంత ఇంటి పథకం, పెర్క్స్‌ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎన్నికల్లో కార్మికులు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

ఆటో డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన గడిపెల్లి శ్రీనివాస్‌, ఆర్టీసీ డిపో కార్యదర్శిగా గెలుపొందిన కేకే రెడ్డి, వారి ప్యానల్‌ సభ్యులకు ఈసంపల్లి రమేష్‌ అభినందనలు తెలిపారు.